బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు అంబేద్కర్​ : స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​

బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు అంబేద్కర్​ : స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​
  • వికారాబాద్​ ఎన్కేపల్లి చౌరస్తాలో అంబేద్కర్​ విగ్రహావిష్కరణ

వికారాబాద్, వెలుగు: బడుగు, బలహీన వర్గాల ఆత్మబంధువు డాక్టర్​బీఆర్.అంబేద్కర్అని అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ లోని ఎన్కేపల్లి చౌరస్తాలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్​రెడ్డి, ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్ రెడ్డి, బి.మనోహర్ రెడ్డి, కాలె యాదయ్య, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి బుధవారం అంబేద్కర్  కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

తాను పడిన కష్టాలను భవిష్యత్​లో తన జాతి పడకూడదని అంబేడ్కర్  రిజర్వేషన్లు అనే బ్రహ్మాస్త్రాన్ని మనకు ఇచ్చారని కొనియాడారు. దేశ చరిత్రలోనే మొదటిసారి ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని, ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్టెట్ లో రూ.40,232 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశానికి దారి చూపిన మహానుభావుడు అంబేద్కర్ అన్నారు.  

చీఫ్ విప్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అంబేద్కర్ ను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం, మాజీ ఎమ్మెల్యే ఆనంద్, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు రమేశ్ మహరాజ్, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, ఆర్టీఏ మెంబర్ జాఫర్, దళిత సంఘాల ప్రతినిధులుపాల్గొన్నారు.  

‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్​కుమార్​ పిలుపునిచ్చారు. బుధవారం డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్​రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్​పార్టీ వికారాబాద్ జిల్లా సంస్థాగత, నిర్మాణ సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన స్పీకర్​మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, అసంపూర్తిగా ఉన్న వాటిని త్వరలోనే పూర్తి చేస్తుందన్నారు.

ఒకే స్థానానికి ఇద్దరు నాయకులు పోటీ చేసి ఇబ్బంది పడొద్దని, అందరూ కలిసి చర్చించుకొని, ఒక్కరే పోటీ చేసేలా చూసుకోవాలన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్​రెడ్డి, పోలీస్​హౌసింగ్​ కార్పొరేషన్​ చైర్మన్​ గుర్నాథ్​రెడ్డి, పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు రమేశ్,తదితరులున్నారు.